

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో ఆయనపై దాదాపు ఏడు గంటల పాటు అధికారులు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా హరీష్ రావు వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. విచారణ పూర్తయ్యాక ఆయన నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో సమయాన్ని వృథా చేశారని విమర్శించిన ఆయన, సింగరేణి టెండర్లలో జరిగిన అవకతవకలపై తామే ప్రశ్నలు లేవనెత్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించిన హరీష్ రావు, ఈ అంశంపై సింగిల్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని నిన్న (జనవరి 19) సిట్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. వాటి మేరకు ఈ రోజు (జనవరి 20) ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ముందు హాజరయ్యారు. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో జరిగిన విచారణలో, ఫోన్ ట్యాపింగ్‌లో తన పాత్ర ఏమిటి, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయించారనే అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సిద్ధిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు నేపథ్యంలోనే హరీష్ రావును సిట్ విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావు అనుచరులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయగా, వారి వాంగ్మూలాలను కూడా సిట్ నమోదు చేసింది. ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు మాజీ పోలీస్ అధికారుల వాంగ్మూలాలు, అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 ఫోన్ నంబర్ల ట్యాపింగ్ వివరాల ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లను కూడా విచారించిన సిట్, వారి నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు మరియు వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలను సేకరించినట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!