

తనపై వస్తున్న ఆరోపణల పై సింగర్ మంగ్లీ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తన పేరు, ఫోటోలను ఉపయోగించి పేదల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. నేను పాటల ప్రపంచంలోనే ఉన్నాను. స్కామ్‌ల గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో నా పేరును తప్పుగా ఉపయోగించారు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాను అని మంగ్లీ అన్నారు.
తాను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినని, డబ్బు విలువ తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. గత నెల రోజులుగా తన ప్రోగ్రామ్‌లు, రికార్డింగ్స్ కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని తెలిపారు. దయచేసి నా గురించి తప్పుగా నమ్మకండి. నా ఫోటోలను కూడా అనవసరంగా వాడకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరుల పై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు తాను అండగా ఉంటానని మంగ్లీ తెలిపారు.
మంగ్లీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, అసలు నేరగాళ్లే బాధితులుగా నటిస్తూ ముందుకు వస్తున్నారని ఆరోపించారు. సుభాక్షేత్ర బిజినెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి ఈ మోసం జరిగిందని, ఇందులో మధు నాయక్ మరియు హేమకాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!