

United States లో తీవ్ర స్థాయి మంచు తుఫాను విస్తృతంగా ప్రభావం చూపుతోంది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుండగా, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహామా రాష్ట్రాల్లో ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
మంచు తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విమాన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం సుమారు 3,300 విమానాలు, ఆదివారం దాదాపు 7,000 విమాన సర్వీసులు రద్దయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి వంటి రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలైన మిసిసిపి, ఫ్లోరిడాలో కూడా ప్రమాదకర స్థాయిలో చలి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 25 మరియు 26 తేదీల్లో న్యూయార్క్, న్యూజెర్సీకి వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేయగా, ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి సహాయం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపింది.












.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!