

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌కు అల్పపీడన ముప్పు నుంచి ఊరట లభించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ, బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ వాయుగుండం శుక్రవారం నాటికి తమిళనాడు తీరం వైపు దిశ మార్చుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఈ వాతావరణ వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కువగా పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం నాటికి దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని, మిగిలిన ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉండొచ్చని అంచనా వేసింది. ఈ మార్పుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!