

విశ్వకోటికి వెలుగునిచ్చే ఆదిత్యుడి పండగకు అరసవల్లిలోని ఆదిత్య క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. సూర్యజయంతి, ఆదివారం ఒకేసారి రావడంతో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదినారాయణుడి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ పరిసరాలను భక్తిశ్రద్ధలతో నింపారు.
శనివారం రాత్రి 9 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిరీక్షించగా, అర్ధరాత్రి 12.30 గంటలకు మహాక్షీరాభిషేక సేవ కనుల పండువగా ప్రారంభమైంది. మాఘశుద్ధ సప్తమి పర్వదినాన ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఇప్పిలి నాగేశ్శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలు భక్తులను పరవశింపజేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భానుడి నిజరూప దర్శనంతో భక్తులు పులకించిపోయారు. ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల కోలాహలం, సంప్రదాయ రీతుల నిర్వహణతో అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!