

సంధ్య థియేటర్లో 2024 డిసెంబర్ 4 న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు ఈరోజు శనివారం ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 23 మంది పై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో సినీ నటుడు అల్లు అర్జున్ ను ఏ-11గా పేర్కొన్నారు.
ఈ కేసులో ఏ-1 గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను చేర్చగా, అల్లు అర్జున్తో పాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది మరియు 8 మంది బౌన్సర్ల పై కూడా అభియోగాలు మోపారు. థియేటర్ యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్న పోలీసులు, తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!