

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, అందులో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027 సందర్భంగా ప్రజలు అందించే సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉండటంతో పాటు డిజిటల్ రూపంలో భద్రపరచబడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో దేశ ప్రజలంతా చురుకుగా భాగస్వామ్యం కావాలని కోరారు. రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో నిన్న ప్రసంగించిన ప్రధాని, తమిళనాడులోని కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ‘క్రిటికాలిటీ’ సాధించడం దేశానికి చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. అణు శాస్త్రవేత్తల ప్రతిభను అభినందిస్తూ, పౌర అణు కార్యక్రమం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందని చెప్పారు.
దేశం పవన శక్తి ఉత్పత్తిలో మరో కీలక మైలురాయిని చేరుకుందని ప్రధాని వెల్లడించారు. ఈ రంగంలో భారత్ ఉత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లను దాటిందని, ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. డైరీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ భారతీయ సంప్రదాయ రుచులకు కొత్త గుర్తింపును తీసుకువస్తోందని చెప్పారు. ఈశాన్య భారత కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అక్కడ తయారయ్యే వెదురు వస్తువులను ప్రజలు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్‌ను స్మరించుకుంటూ, ఆయన గొప్ప రచయిత, ఆలోచనాపరుడని, అనేక ప్రఖ్యాత సంస్థలకు రూపకర్త అని కొనియాడారు. చిలీలోని ఒక సంస్థ బుద్ధుడి బోధనలను ప్రచారం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!