

సరిహద్దులో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పాకిస్తాన్ మరోసారి డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలు జారవిడిచే ప్రయత్నం చేసింది. అయితే అప్రమత్తంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు వెంబడి పాక్ తరచూ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఆయుధాలు, మాదక ద్రవ్యాలను పంపే ప్రయత్నాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
వివరాల ప్రకారం, నిన్న తెల్లవారుజామున జమ్మూలోని సాంబా సెక్టార్లో అనుమానాస్పద డ్రోన్ కదలికలు గుర్తించగా, బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే గాలింపు చర్యలు చేపట్టాయి. ఫ్లోరా గ్రామం సమీపంలో నిర్వహించిన సోదాల్లో మూడు పిస్టల్స్, ఒక గ్రెనేడ్, 16 బుల్లెట్లు, మూడు పిస్టల్ మ్యాగజైన్లు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో మరిన్ని ఆయుధాలు లేదా డ్రగ్స్ జారవిడిచారా అన్న కోణంలో గాలింపు కొనసాగుతోంది. ఈ ఆయుధాలు ఎవరి కోసం పంపించారన్నది, దీని వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ ఏమిటన్న అంశాలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!