

ప్రపంచ ప్రముఖ ఓటీటీ వేదికతో పాటు వీఎఫ్ఎక్స్ మరియు వర్చువల్ ప్రొడక్షన్ రంగంలో ప్రముఖ సంస్థగా నిలిచిన నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కార్యాలయాన్ని ఈ నెల 12 న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మరియు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ విస్తరణ చేపడుతోంది. ప్రస్తుతం ముంబయిలో కార్యాలయం నిర్వహిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌కు హైదరాబాద్ రెండో కార్యాలయంగా నిలవనుంది. ఈ విస్తరణతో నగరంలోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ ఏర్పాటు వల్ల సృజనాత్మక మరియు సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా ఏవీజీసీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ కంటెంట్ సృష్టిలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఇది కీలక అడుగుగా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే నగరంలో అనేక ప్రపంచ ప్రఖ్యాత వీఎఫ్ఎక్స్ సంస్థలు హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన సేవలను అందిస్తున్నాయి. వాటిలో వార్నర్ బ్రదర్స్, డిస్నీ, స్కైలైన్ వీఎఫ్ఎక్స్, మాటెల్, బార్న్ స్టార్మ్ వీఎఫ్ఎక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఉబిసాఫ్ట్ వంటి సంస్థలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల్లో వినియోగించే మోషన్ క్యాప్చర్ సాంకేతికత కూడా ఇటీవల హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ‘ఎం అండ్ ఎం క్యాప్ ల్యాబ్’ను ఇటీవల ప్రారంభించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!