

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం వనజాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజే లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మేడారం అడవులు భక్తిశ్రద్ధలతో మార్మోగాయి. సారలమ్మను గద్దెల ప్రాంగణానికి ఆహ్వానించే కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. మేడారానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి ఆలయంలో ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని అలంకరించగా, సంప్రదాయ వాద్యాలు, నృత్యాలతో వాతావరణం పండుగ శోభను సంతరించుకుంది.
రాత్రి 7:40 గంటలకు సారలమ్మను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు వరాలు పడుతూ పొర్లుదండాలు పెట్టగా, పూజారులు వెదురుబుట్టలో అమ్మవారిని మోసుకుంటూ ముందుకు సాగారు. జంపన్నవాగు దాటి మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్న అనంతరం పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్ధరాత్రి తర్వాత గద్దెలపై కొలువు దీర్చారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో 13 వేల మంది పోలీసులు భద్రత ఏర్పాటు చేయగా, 42 సెక్టార్లలో 21 శాఖలకు చెందిన సుమారు 40 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో పాల్గొన్నారు. వేల వాహనాలు, నిండిపోయిన పార్కింగ్ స్థలాలు, జంపన్నవాగులో పుణ్యస్నానాలు, కిక్కిరిసిన క్యూలైన్లతో మేడారం తొలి రోజే జనసంద్రంగా మారింది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!