

భారత్ దాదాపు 80 సైనిక రవాణా విమానాల కొనుగోలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, అమెరికాకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ తన సి-130జె సూపర్ హెర్క్యులెస్ విమానాలను ఈ పోటీలో ముందుకు తెచ్చింది. ఈ విమానాలు భారత అవసరాలకు అత్యంత అనువైనవని సంస్థ స్పష్టం చేసింది.
ఈ భారీ కాంట్రాక్టులో తమను ఎంపిక చేస్తే, భారత్‌లోనే సి-130జె విమానాల ఉత్పత్తి కోసం ఒక మెగాహబ్ను ఏర్పాటు చేస్తామని లాక్‌హీడ్ మార్టిన్ ప్రకటించింది. అక్కడ తయారయ్యే విమానాలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశముందని తెలిపింది. అమెరికా వెలుపల ఇలాంటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించింది.
సి-130జె సూపర్ హెర్క్యులెస్ విమానాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో సేవలు అందిస్తున్నాయని సంస్థ గుర్తు చేసింది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే ఈ తరగతికి చెందిన 12 విమానాలు ఉన్నాయని కూడా పేర్కొంది. క్వాడ్ కూటమిలో భాగమైన ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు సైతం ఆధునిక సి-130జె విమానాలను తమ సైన్యంలోకి తీసుకుంటున్నాయని లాక్‌హీడ్ మార్టిన్ ఉన్నతాధికారి రాబర్ట్ టాథ్ తెలిపారు.
ఈ తరహా మరిన్ని విమానాలను భారత్ సమకూర్చుకుంటే, వ్యూహాత్మకంగా దేశానికి పైచేయి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సి-130జె విమానాలకు సంబంధించిన కొన్ని ముఖ్య భాగాలను లాక్‌హీడ్ మార్టిన్, భారత సంస్థ టాటా తో కలిసి ఇప్పటికే హైదరాబాద్‌లో తయారు చేస్తోంది.
ఈ సైనిక రవాణా విమానాల కాంట్రాక్టుకు బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రేయర్ తయారు చేసిన కేసీ-390 మిలీనియం విమానం, యూరప్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థ ఎ-400ఎం విమానం కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!