

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ లియర్ జెట్ 45 విమానాన్ని నడిపిన బృందంలో మహిళా పైలట్ శాంభవి పాటక్ కూడా ఉన్నారు. విమానానికి పైలట్ ఇన్ కమాండ్‌గా సీనియర్ కెప్టెన్ సుమిత్ కపూర్ బాధ్యతలు నిర్వహించారు. టేకాఫ్, ల్యాండింగ్ సహా విమానానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. బిజినెస్ జెట్లను నడపడంలో కెప్టెన్ కపూర్‌కు విశేష అనుభవం ఉందని, లియర్ జెట్‌కు సురక్షిత రికార్డు ఉందని వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ వెల్లడించింది.
మహిళా పైలట్ శాంభవి పాటక్ ఈ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ (కో–పైలట్)గా విధులు నిర్వహించారు. ఆమె కెప్టెన్‌కు సహకరిస్తూ ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్ల నిర్వహణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో నిరంతర సంప్రదింపులు నిర్వహించారు. గ్వాలియర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన శాంభవి, 2016 నుంచి 2018 మధ్య పైలట్ శిక్షణ పూర్తి చేశారు. మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ సభ్యురాలైన ఆమె అనుభవజ్ఞులైన పైలట్లతో కలిసి అనేక ఛార్టెడ్ విమానాలు నడిపిన అనుభవం కలిగి ఉన్నారు.
ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది సభ్యుడైన సాహిల్ మాదన్ కూడా మృతి చెందారు. విమాన అటెండెంట్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విమానం రాత్రి 8.10 నిమిషాలకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి టేకాఫ్ తీసుకోగా, 8.45 నిమిషాల సమయంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. బారామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో విమానం చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. కూలిన అనంతరం భారీ శబ్దం, మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. విమానం పలు మార్లు పేలినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!