

నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదికి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. తాజా తీర్పు ప్రకారం ఆమెకు మొత్తం ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. ప్రస్తుతం జైలులో ఉండగానే ప్రభుత్వ విధానాలకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఈ తీర్పు వెలువడటం గమనార్హం. ఆమె న్యాయవాది మోస్తఫా నీలీ తెలిపిన వివరాల ప్రకారం, “దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు, సమావేశాలు నిర్వహించడం” కేసులో ఆరు సంవత్సరాలు, “ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం” ఆరోపణపై ఏడాదిన్నర జైలు శిక్ష విధించారు.
జైలు శిక్షతో పాటు ఆమెపై మరికొన్ని ఆంక్షలు కూడా విధించారు. రెండు సంవత్సరాల పాటు విదేశాలకు వెళ్లే హక్కును నిషేధించడంతో పాటు, టెహ్రాన్ నుంచి సుమారు 740 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ఖొరాసాన్ ప్రావిన్స్‌లోని ఖోస్ఫ్ పట్టణానికి అంతర్గత బహిష్కరణ విధించారు. 2023 లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నప్పటికీ ఆమె అప్పటికే జైలులోనే ఉండటం విశేషం. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నర్గెస్ మొహమ్మదిని వెంటనే విడుదల చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తూ, ఈ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!