

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం లో నిర్మించిన నూతన నిత్యాన్నదాన సత్ర భవనం ఆదివారం నుంచి భక్తుల సేవలోకి ప్రవేశించింది. దాతలు, వైటీడీ ఏ మరియు దేవస్థానం సహకారం తో ఏర్పాటైన ఈ సత్ర భవనాన్ని ఈవో వెంకట్రావు, ప్రముఖ దాత వేగేశ్న అనంతకోటి రాజు తో కలిసి ప్రారంభించారు.
సుమారు 1.20 ఎకరాలలో రూ.23 కోట్ల వ్యయంతో ఈ సదుపాయాన్ని నిర్మించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన వేగేశ్న అనంతకోటి రాజు ఒక్కరే రూ.14 కోట్లు విరాళంగా అందించారు. మిగతా పనులను వైటీడీఏ మరియు దేవస్థానం భరించాయి.
సత్ర భవనంలో రెండు విస్తృతమైన డైనింగ్ హాళ్లు, రెండు వెయిటింగ్ హాళ్లు, 12 స్టోర్ రూములు ఏర్పాటు చేశారు. ఆధునిక వంటశాల కోసం ప్రత్యేకంగా బాయిలర్లు, ఆటోమేటిక్ గిన్నెలు శుభ్రం చేసే యంత్రాలు, గ్యాస్ లైన్లు, పెద్ద పరిమాణం వంట పరికరాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి రెండు వేల నుంచి ఐదు వేల మంది భక్తులు కూర్చుని భోజనం చేయగలిగేలా వ్యవస్థలను రూపొందించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, కృష్ణ, శంకర్ నాయక్, నవీన్ పాల్గొన్నారు.
ఆదివారం రోజున కొండ పై బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, కొండకింద లక్ష్మీ పుష్కరిణి, వ్రత మండపాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆలయానికి మొత్తం రూ.48,99,878 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో ప్రసాదాల విక్రయం ద్వారా రూ.17,23,370, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.8.70 లక్షలు, వాహనాల ప్రవేశ రుసుముల ద్వారా రూ.5,98,500, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.4,20,900 వచ్చినట్లు వివరించారు.










కామెంట్స్ (1)
లక్ష్మీనరసింహ స్వామి🙌