

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించి వారికి అన్ని విధాలుగా సాయం అందించాలనే లక్ష్యంతో ఇంటింటి సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయంతో బీపీఎల్ కుటుంబాల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత చేయూత అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, ఈ కొత్త కార్యక్రమం పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ఉండనుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో విడతల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి, తొలుత అత్యంత వెనుకబడిన గ్రామాల్లో పేదలను గుర్తిస్తామని మంత్రి తెలిపారు. సర్వే అనంతరం విద్య, ఉపాధి, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో లబ్దిదారులకు దశలవారీగా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.
లబ్దిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని సీతక్క తెలిపారు. గ్రామస్తులందరినీ ఒకేచోట చేర్చి, కుటుంబ జీవనం, ఆదాయం, నివాస పరిస్థితులు, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తామని చెప్పారు. త్వరలో ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!