

గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం పై నెలకొన్న వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారం పై తెలంగాణ హైకోర్టు జనవరి 22 న తుది తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించిందని పేర్కొంటూ గతంలో సింగిల్ జడ్జి కీలక తీర్పు ఇచ్చారు. మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు చేసి, జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ తో పాటు గ్రూప్-1లో ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ అప్పీళ్ల పై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో 2022 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ, అదనపు పోస్టులతో కలిపి 563 పోస్టులకు మరో నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని, ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్ నంబర్లు కేటాయించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. అలాగే, కొన్ని పరీక్ష కేంద్రాల అభ్యర్థులకే ఎక్కువ మార్కులు రావడం, అన్ని సబ్జెక్టుల నిపుణులు మూల్యాంకనంలో పాల్గొనకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.
ఇదే సమయంలో టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి, ఎంపికైన అభ్యర్థుల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పరీక్షలు నిబంధనల ప్రకారమే, పూర్తి పారదర్శకతతో నిర్వహించామని తెలిపారు. ఒకే జవాబు పత్రాన్ని ఇద్దరు మూల్యాంకనం చేయడం, మార్కుల్లో తేడా ఎక్కువగా ఉంటే మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించడం వంటి విధానాలు అవకతవకలు జరగకుండా తీసుకున్న చర్యలేనని స్పష్టం చేశారు. కాపీయింగ్ ఆరోపణలు లేవని, కొన్ని కేంద్రాల్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారనే కారణంతో పరీక్షలను రద్దు చేయడం సరికాదని వాదించారు.
సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం, ధర్మాసనం బుధవారం రాతపూర్వక వాదనలు సమర్పించవచ్చని తెలిపి, తుది తీర్పును జనవరి 22 న ప్రకటిస్తామని వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!