

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ రద్దీతో భాగ్యనగరం ఖాళీ అవుతోందా అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు సుమారు 21 వేల వాహనాలు, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరో 22 వేల వాహనాలు విజయవాడ వైపు ప్రయాణించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ లెక్కన గంటకు సగటున 2,700 వాహనాలు వెళ్తున్నాయి.
సాధారణ రోజుల్లో రెండు వైపులా కలిపి సుమారు 40 వేల వాహనాలు ప్రయాణిస్తుండగా, ప్రస్తుతం ఒక్క వైపే భారీగా వాహనాలు కదులుతున్నాయి. గతేడాది రద్దీ అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిట్యాలలో జరుగుతున్న రహదారి పనుల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు. అలాగే విశాఖపట్నం, రాజమహేంద్రవరం వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద 365బీబీ హైవే వైపు మళ్లించారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ, డీఎస్పీ ప్రసన్నకుమార్ డ్రోన్ కెమెరాతో ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వాహనదారులకు గులాబీ పువ్వులు ఇచ్చి సురక్షిత ప్రయాణం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!