

రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత బలపడగానే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తైన నేపథ్యంలో గురువారం హైదరాబాద్లో పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలను అధిగమించేందుకు రూపొందించిన మార్గదర్శకాల బుక్లెట్ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క సీజన్లో 70.71 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేపట్టి, 15 లక్షల మంది రైతులకు రూ.19 వేల కోట్ల నగదు బదిలీ చేయడం ద్వారా ఈ ఖరీఫ్ సీజన్ చరిత్ర సృష్టించిందన్నారు. గతంలో ధాన్యం అమ్మి డిఫాల్టర్లుగా మారిన రైస్ మిల్లర్లకు సీఎంఆర్ కోటా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో 863 మంది డిఫాల్టర్లకు ధాన్యం కేటాయించలేదని, యాసంగి సీజన్లో కూడా వారికి అవకాశం లేదని ఉత్తమ్ స్పష్టంగా వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!