

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తృత స్థాయి పరిపాలనా పునర్వ్యవస్థీకరణతో నగర పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్బీలు) జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 1.34 కోట్లకు పైగా జనాభా నివసిస్తుండటంతో, ఇది దేశంలోనే అతిపెద్ద పట్టణ పాలనా సంస్థలలో ఒకటిగా మారింది. పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఉన్న 6 జోన్లు, 30 సర్కిళ్ల స్థానంలో 12 జోన్లు, 60 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. ఈ మార్పులతో పారిశుధ్యం, రహదారులు, డ్రెయినేజీ, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో పోలీస్ శాఖలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అనే మూడు పోలీస్ కమిషనరేట్లను కలిపి మొత్తం 12 జోన్లుగా పునర్వ్యవస్థీకరించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 6 జోన్లు, సైబరాబాద్‌లో 3 జోన్లు, రాచకొండలో 3 జోన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్ జోన్లు ఉండగా, ఇకపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రానుంది. సైబరాబాద్ కమిషనరేట్‌లో శేరిలింగంపల్లి జోన్‌ను మొయినాబాద్ నుంచి పటాన్చెరు వరకు విస్తరించగా, మాదాపూర్‌ను కూకట్పల్లి జోన్లో చేర్చారు, అలాగే కుత్బుల్లాపూర్ జోన్‌ను ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ జోన్లు కొనసాగనున్నాయి. ఇదే సమయంలో యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోని మహేశ్వరం జోన్‌తో పాటు షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాలను కలిపి భవిష్యత్ సిటీ పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పాటు చేసే యోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం. ఈ సమగ్ర మార్పులతో నగర పాలనతో పాటు భద్రతా వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!