

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం ప్రస్తుతం లీక్ వివాదంతో వార్తల్లో నిలిచింది. సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్, టైటిల్ కార్డ్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్‌ను షాక్‌కు గురిచేసింది. ఈ లీక్‌కు ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్ కారణమంటూ వచ్చిన ప్రచారాన్ని ఎడిటర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. గ్రాఫిక్స్, సౌండ్ మిక్సింగ్ మెరుగుదల కోసం దర్శకుడు హెచ్. వినోద్ మరియు నిర్మాతల అనుమతితోనే జనవరి 14న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకు కాపీ పంపినట్లు యూనియన్ స్పష్టం చేసింది. లీక్ చేయాలనుకుంటే వాటర్‌మార్క్‌తో పంపరని వారు ప్రశ్నించారు.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ డ్రైవ్ లింకుల ద్వారా సినిమా కంటెంట్‌ను షేర్ చేసిన వారిని గుర్తించి రిమాండ్‌కు తరలించారు. దాదాపు 300కు పైగా పైరసీ లింకులను అధికారులు బ్లాక్ చేశారు. ఈ లీక్ వెనుక స్టూడియో సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనకు రాజకీయ కోణం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, తనకు ఈ విషయంపై సమాచారం లేదని తెలిపారు. సెన్సార్ బోర్డు కూడా తమవైపు ఎలాంటి తప్పు లేదని, ఫైనల్ కాపీని మేకర్స్‌కు అప్పగించినట్లు స్పష్టం చేసింది.
సెన్సార్ అభ్యంతరాలు, కోర్టు వాదనలు కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా విడుదలపై ఇప్పటికే అనిశ్చితి నెలకొంది. తాజాగా జరిగిన లీక్ ఘటనతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఈ ఘటనపై సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు పైరసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. నిర్మాతలు భారీ ఆర్థిక నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు స్టూడియో డేటా యాక్సెస్ చేసిన వారిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్ని వివాదాల మధ్య ‘జన నాయగన్’ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందన్నది ఆసక్తిగా మారింది.



















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!