

విశాఖపట్నంలో అనధికారికంగా నిల్వ ఉంచిన బాణసంచా కారణంగా ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘటన జీవీఎంసీ 89వ వార్డు మహాత్మా ఆదర్శనగర్ ప్రాంతంలో జరిగింది. స్థానిక శ్మశానవాటిక సమీపంలో ఉన్న ఓ ఇంటిని డి. శివకృష్ణకుమార్ అలియాస్ బాంబుల శివ (40) అద్దెకు తీసుకుని, అందులో అనధికారికంగా బాణసంచా తయారీ మరియు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న జరగనున్న ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని ఆ ఇంట్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది.
ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆ ఇంటి నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగతో పాటు మంటలు రావడంతో వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతతో ఇంటి గోడలు, శ్లాబ్లు దెబ్బతిన్నాయి. పక్కనే ఉన్న రేకుల షెడ్ల పైకప్పులపై గోడ ముక్కలు పడటంతో అవి కూడా దెబ్బతిన్నాయి. సమీపంలోని కొన్ని ఇళ్ల గోడల్లో పగుళ్లు ఏర్పడగా, ఇంట్లో ఉన్న వస్తువులు మరియు ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు శ్లాబ్ ముక్కలు తగిలి స్వల్ప గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పేలుళ్ల శబ్దం మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే బాణసంచా నిల్వ ఉంచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాంబుల శివ ఘటన అనంతరం పరారైనట్లు పోలీసులు తెలిపారు. మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!