

క్రిస్మస్ పండుగ వేళ కర్ణాటకలో భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సును ఒక లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది సజీవదహనమయ్యారు.
ప్రమాదానికి గురైన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తుండగా, చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టిన తర్వాత బస్సు, లారీ రెండూ పూర్తిగా దగ్ధమయ్యాయి.
హిరియూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో, ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయని సమాచారం. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో 20 మంది సజీవదహనమయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!