

ఎనిమిదో వేతన సంఘం కింద జీతాల పెరుగుదల పై చర్చలు జరుగుతున్న సమయంలో, కొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు కొత్త పద్ధతితో ముందుకొచ్చారు.
ప్రతిపాదిత వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో ఖచ్చితంగా లెక్కించి చెబుతామంటూ వాట్సాప్ ద్వారా తప్పుడు సందేశాలు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లతో పాటు 8 వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్ లేదా శాలరీ రివిజన్ టూల్ అనే పేర్లతో ఏపీకే ఫైల్స్‌ను జత చేస్తున్నారు.
ఈ ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసి మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మొత్తం మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. బ్యాంకు వివరాలు, ఎస్ఎంఎస్లు, ఓటీపీలు వంటి కీలక డేటా కూడా వారికి చేరుతుంది. ఫోన్ యజమానికి తెలియకుండానే ఖాతాల నుంచి డబ్బు బదిలీ చేసే ప్రమాదం ఉంది.
ఇలాంటి ఘటనల పై ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయమైందని బాధితులు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ను పంపదని సైబర్ నిపుణులు స్పష్టం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు అపరిచిత లింకులు లేదా ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!