

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరుతో కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఆరు జిల్లాల పరిధిలో గుర్తించిన 262 పంచాయతీలను మురుగు విడుదల రహితంగా తీర్చిదిద్దడం, గోదావరిలో కాలుష్య కారక వ్యర్థాల విడుదలను పూర్తిగా నిలువరించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతో పాటు పారిశ్రామిక కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు ఆర్టీజీఎస్ తరహా నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. ప్రధాన నదుల కాలుష్య నివారణ కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ బాధ్యతలు చేపడుతుందని తెలిపారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 8.38 మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని నియంత్రించేందుకు గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్లు, కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధమైంది. పుష్కరాల నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అవసరమైన నిధులను వినియోగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!