

చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణ పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో అధికారులు, గుత్తేదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనుల్లో జాప్యం అస్సలు సహించబోమన్నారు. లక్ష్యాలకు తగ్గట్టుగా పనులు జరగకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనుల నాణ్యతలో లోపం, నిర్లక్ష్యం ఏ రూపంలోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై కూడా మండిపడి, భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సీఎం పేర్కొన్నారు. చిన్న సంఘటనలకే రాజకీయ రంగు పులుముతున్న పరిస్థితుల్లో మరింత జాగ్రత్త అవసరమని హెచ్చరించారు. ప్రాజెక్టు మేనేజర్ల నియామకంలో లోపాలు ఉన్నాయని అధికారులు తెలిపిన నేపథ్యంలో, పనులపై ప్రభావం పడేలా చేసే వ్యవహారాలను సహించబోమన్నారు. అమరావతి నిర్మాణం చారిత్రాత్మక బాధ్యతగా భావించి ప్రతి సంస్థ పని చేయాలని సూచించారు.
రాజధాని నిర్మాణాన్ని సమయానికి పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. వారానికో, నెలకొక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, వర్షాకాలం ముందే పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం వేలాది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ, అవసరమైన యంత్రాలు, మానవ వనరులు పెంచాలని సూచించారు. స్థానిక కార్మికులను ఎక్కువగా వినియోగించుకోవాలని కూడా సూచించారు.
అమరావతి అభివృద్ధిలో గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికత వినియోగంపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!