

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జూన్ 2 నుంచి ప్రారంభించనున్న కొత్త పథకాల గురించి ప్రజలకు సమగ్రంగా వివరించాలని డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క మల్లు సూచించారు. “ప్రజా పాలన – ప్రజా ప్రణాళిక” (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ప్రజాభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, అన్ని గ్రామాల్లో ఒకే విధమైన విధానాన్ని అనుసరించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లను ఆదేశించారు. గ్రామసభలలో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరంగా చదివి వినిపించాలని సూచించారు. రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను సాధ్యమైనంతవరకు గ్రామసభల్లో ప్రకటించాలని చెప్పారు. అలాగే ఇప్పటివరకు అమలవుతున్న పథకాలు, జూన్ 2 నుంచి అందరికీ జీవిత బీమా పథకం ప్రారంభం కానున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.
అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడంతో పాటు మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందిస్తున్న విషయాన్ని వివరించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. గ్రామపంచాయతీలకు భారీగా నిధులు విడుదల చేస్తున్నందున, గ్రామసభల సమయంలో ఆయా గ్రామాలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమం పురోగతిని చీఫ్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమానికే కాకుండా మౌలిక సదుపాయాలు, సేవారంగ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తూ ముందుకు సాగుతోందని ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!