

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అసెంబ్లీ మీడియా హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దిశా నిర్దేశం లేకుండా శాసనసభ సమావేశాలు తూతూ మంత్రంగా ముగిశాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం సభను ముగించిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్, బిల్లులు ఆమోదించుకోవడం కోసం మాత్రమే సభను నిర్వహించినట్లు కనిపించిందని, నిజమైన ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం దూరంగా పారిపోయిందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై స్పష్టత రావాలని ఆశించినప్పటికీ తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చ కోసం బీఆర్ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. అసెంబ్లీ సంప్రదాయాలను తుంగలో తొక్కారని, సభా మర్యాదలు పాటించలేదని, ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల పట్ల అహంకారపూరిత, అనుచిత భాష వాడారని ఆయన విమర్శించారు.
అలాగే, సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించలేదని హరీశ్ రావు అన్నారు. సమావేశాలను సమయానికి ప్రారంభించకపోవడం, బ్రేక్‌ల పేరుతో గంటల తరబడి సభను నిలిపివేయడం వంటి చర్యలు సభ గౌరవాన్ని తగ్గించాయని తెలిపారు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని ముందుగానే ముగించారని, ప్రజల సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆరోపించారు. మంత్రి పొంగులేటి అవినీతిపై ఆధారాలు బయటపెట్టినప్పటికీ, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారని, ప్రతిపక్షం లేకుండా కీలక బిల్లులను ఆమోదించుకున్నారని ఆయన విమర్శించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!