

భారత రక్షణ రంగ చరిత్రలో అత్యంత కీలకమైన కొనుగోలు ఒప్పందానికి మార్గం సుగమమైంది. దేశ వాయుసేన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో మరో 114 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది.
మొత్తం రూ.3.60 లక్షల కోట్ల విలువైన సైనిక సామగ్రి కొనుగోళ్లకు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రఫేల్ యుద్ధవిమానాలతో పాటు వాయుసేన కోసం క్షిపణులు, ఎయిర్-షిప్ ఆధారిత హై ఆల్టిట్యూట్ సూడో శాటిలైట్ వ్యవస్థ, నౌకాదళానికి ఆరు బోయింగ్ పీ8-ఐ నిఘా విమానాలు, సైన్యానికి వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్లు, టీ-72 ట్యాంకుల మరమ్మతులు వంటి అంశాలు ఉన్నాయి.
రఫేల్ యుద్ధవిమానాల ఖర్చు విషయాన్ని రక్షణ శాఖ స్పష్టంగా వెల్లడించలేదు. అయితే అంచనాల ప్రకారం ఇది రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.3.15 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది. బహుళ ప్రయోజన యుద్ధవిమానాల ప్రాజెక్టులో భాగంగా 18 రఫేల్ విమానాలను ఫ్రాన్స్‌లో తయారు చేసి నేరుగా భారత్‌కు సరఫరా చేయనున్నారు. మిగిలిన 96 విమానాలను దేశీయంగా తయారు చేయనున్నారు.
ఈ నెల 17 నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య అంతర్ ప్రభుత్వ ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం అవసరం.
మధ్యస్థాయి బహుళ ప్రయోజన యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ 1990 ల నుంచే ప్రారంభమైంది. 2004 లో సమాచారం కోసం వినతి జారీ చేయగా, 2016 లో 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. అనంతరం 2019 లో మరో 114 విమానాల కోసం ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు.
ఇటీవల నౌకాదళం కోసం రూ.64 వేల కోట్లతో 26 మెరైన్ వేరియంట్ రఫేల్ విమానాల కొనుగోలుకు కూడా ఒప్పందం కుదిరింది. అలాగే తీరరక్షక దళం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 8 డోర్నియర్ విమానాల కొనుగోలుకు రూ.2,312 కోట్ల ఒప్పందం ఖరారైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!