

ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయటంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. సచివాలయంలో మంగళవారం జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తుందన్నారు
జిల్లాల్లో కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి తనకు నివేదికను అందించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. నెలలో అయిదు రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆషామాషీగా మీరు ఐఏఎస్ కాలేరు. ఐఏఎస్లందరూ కలెక్టరుగా పని చేయాలని కలలు కంటారు. అత్యున్నతమైన గౌరవముండే సర్వీసులో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే మీరు కలెక్టర్లుగా కొనసాగుతారు. కలెక్టర్లుగా క్షేత్ర స్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే.. కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలి..’ అన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!