

సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఈ చిత్రంపై చైనా అధికారిక మీడియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైనా ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక ఈ సినిమాపై ఆరోపణల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా ద్వారా భారతదేశం గల్వాన్ లోయ ఘర్షణల చరిత్రను వక్రీకరిస్తూ, చైనాపై వ్యతిరేక భావోద్వేగాలను రెచ్చగొడుతోందని గ్లోబల్ టైమ్స్ ఆరోపించింది. గల్వాన్ లో జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు భారత బలగాలే కారణమని, వాస్తవాలను వక్రీకరించి ప్రపంచ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ బూటకపు వ్యాఖ్యలు చేసింది.
చైనాకు చెడ్డపేరు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందుతోందని, అంతర్జాతీయంగా చైనా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి భారత్ ఈ చిత్రాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని కూడా ఆ కథనంలో పేర్కొంది. భారతదేశం తన అనుకూలంగా కథనాలను మలచుకుంటూ చరిత్రను వక్రీకరిస్తోందన్న ఆరోపణలను చైనా మీడియా మరోసారి పునరుద్ఘాటించింది. అయితే గల్వాన్ ఘటన దేశభక్తి, సైనికుల త్యాగాలను ప్రతిబింబించే సున్నితమైన అంశం కావడంతో, ఈ సినిమాపై భారత ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చైనా మీడియా విమర్శలు మరింతగా ఈ చిత్రంపై దృష్టిని ఆకర్షించడమే కాకుండా, విడుదలకు ముందే ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ను హాట్ టాపిక్‌గా మార్చేశాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!