

బంగ్లాదేశ్‌లో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో పాల్గొనడానికి అనుమతి లేదని తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా చట్టసభ సభ్యులు “అందరికీ అవకాశం ఉన్న ఎన్నికలు” నిర్వహించాలని కోరిన ఒక రోజు తర్వాత, ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
డిసెంబర్ 24, 2025 న ఢాకాలో మీడియాతో మాట్లాడిన చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం, అవామీ లీగ్‌పై తమ వైఖరి స్పష్టమని, ఫిబ్రవరి 2026 ఎన్నికల్లో ఆ పార్టీకి అవకాశం లేదని తెలిపారు. ఇది 1971 తర్వాత అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలిపివేయబడిన తొలి సందర్భం కావడం విశేషం.
తాత్కాలిక ప్రభుత్వం 2025 మే 11 న అవామీ లీగ్ పార్టీ రాజకీయ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అంతకుముందు 2024 అక్టోబర్‌లో ఆ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన ఛాత్ర లీగ్‌ను కూడా బ్యాన్ చేసింది. అలాగే నవంబర్ 17 న అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు మరణ శిక్ష విధించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అవామీ లీగ్‌ను ఎన్నికల నుంచి తప్పించడంపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆ లేఖ గురించి తనకు తెలియదని షఫీకుల్ ఆలం తెలిపారు. పార్టీకి ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోతే, అవామీ లీగ్ మద్దతుదారులు ఓటింగ్‌ను బహిష్కరించే అవకాశం ఉందని షేక్ హసీనా గతంలోనే హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!