

మావోయిస్టు కార్యకలాపాలకు మరోసారి పెద్ద దెబ్బ తగిలింది. నిన్న మారేడిమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో అగ్ర నాయకుడు హిడ్మా సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయిన కొన్ని గంటల్లోనే, అదే ప్రాంతంలో ఈరోజు మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
ఉదయం జరిగిన ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఏడుగురు కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు. అందులో సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఇన్చార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు ప్రొటెక్షన్ టీం కమాండర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి కూడా మరణించారు.
అంతే కాదు, పార్టీ కమ్యూనికేషన్ టీం ఛీఫ్, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్, ఏరియా కమిటీ సభ్యుడు మరియు జాగరగొండ మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ కూడా ఎన్కౌంటర్లో హతమయ్యారు.
వీరితో పాటు జాగరగొండ డిప్యూటీ కమాండర్ శ్రీను అలియాస్ వాసు, అలాగే ఏరియా కమిటీ సభ్యురాలు అనిత, మరో సభ్యురాలు షమ్మి కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
అధికారుల ప్రకారం, ఈ ఏడుగురిపై భారీ రివార్డులు ప్రకటించబడి ఉన్నాయని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో తెలిపింది. నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఆరుగురు ఈరోజు జరిగిన కాల్పుల్లోనే హతమయ్యారని వెల్లడించారు.
అయితే, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ మరణించాడనే పుకార్లను పోలీసులు స్పష్టంగా ఖండించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!