

సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే, మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
ఈ రోజు ఉదయం నుంచే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడూ కాల్పుల శబ్దాలు వినిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు ఆ ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, అక్కడ నక్సల్స్ ఏరివేత చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ కదలికలపై ముందస్తు సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా, ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో కొందరు మావోయిస్టులు మృతి చెందగా, మరికొందరు గాయపడి అడవిలోకి పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దింపి, మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏరివేత చర్యలు పూర్తయ్యాక పూర్తి వివరాలతో పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!