

ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలకమైన పథకమైన అన్న క్యాంటీన్లను విస్తరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కొత్తగా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
సంక్రాంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 13 నుంచి 15 మధ్య ఈ క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామాలకు విస్తరించాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు కూడా రూ.5 కే రుచికరమైన భోజనం అందుబాటులోకి రానుంది.
అన్న క్యాంటీన్ల ద్వారా ప్రస్తుతం రూ.5 కే టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 205 అన్న క్యాంటీన్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు వీటి ద్వారా సుమారు 7.20 కోట్ల మందికిపైగా భోజనం పొందారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి ఎక్కువ మంది క్యాంటీన్లను వినియోగిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో రోజువారీ కూలీలు, ఉపాధి కోసం వచ్చే ప్రజల రద్దీ అధికంగా ఉండటంతో అక్కడి క్యాంటీన్లలో ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!