

గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూలంగా రాష్ట్రాన్ని మలుస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో వేగవంతమైన పాలన అందిస్తున్నామని తెలిపారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ వేదికగా మంగళవారం జరిగిన ‘ది ఆంధ్రప్రదేశ్ ఎడ్వాంటేజ్’ బ్రేక్ఫాస్ట్ సెషన్లో సీఎం ప్రసంగించారు. 1,054 కిలోమీటర్ల తీరప్రాంతం, ఆధునిక పోర్టులు, విమానాశ్రయాలు రాష్ట్రానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచశక్తిగా అవతరిస్తుందని, ఆ ప్రయాణంలో ఏపీ ముందుండబోతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ఇప్పటికే గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్, స్టీల్, డిజిటల్ సేవల రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయని సీఎం తెలిపారు. విశాఖలో ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు కర్మాగారం, బీపీసీఎల్ రూ.లక్ష కోట్ల చమురు శుద్ధి కర్మాగారం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. గత తొమ్మిది నెలల్లో దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించిందని వెల్లడించారు.
పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే మూడునాలుగు సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఉద్యానవన పంటలు, ఆక్వా రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
సీఐఐ నిర్వహించిన సదస్సులో పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ డిజిటల్ విధానంలో అమలు చేస్తున్నామని చెప్పారు. భారత్ ఐటీ రంగంలో సాధించిన విజయాలు, కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావాలు, పర్యాటక రంగాన్ని జీడీపీలో 20 శాతం వరకు పెంచే లక్ష్యంపై సీఎం వివరించారు. ‘కలిసి ఎదుగుదాం.. కలిసి పయనిద్దాం.. భవిష్యత్తు నిర్మిద్దాం’ అంటూ పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!