

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక శుభవార్త ప్రకటించింది. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం చేసే అవకాశం కల్పిస్తోంది. ‘అక్షర గోవిందం’ పేరుతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో తమ పిల్లలకు వకుళమాత ఆశీస్సులతో విద్యా ప్రారంభం చేయాలని కోరుకునే భక్తుల కోరిక నెరవేరనుంది. మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చిన్నారులకు ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాసం చేయించవచ్చు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన విజ్ఞప్తి మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ ప్రాజెక్టును రూపొందించింది. వకుళమాత ప్రధాన ఆలయం ఒక చిన్న కొండపై ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు సులభంగా రావడానికి ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ శాశ్వతంగా ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ మండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతి దేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడే శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం పూర్తయ్యాక చిన్నారులకు ‘అక్షర గోవిందం’ పేరుతో ప్రత్యేక కిట్ ఇస్తారు. ఇందులో పలక, బలపాల పెట్టె, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు – సరస్వతి – శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటం, కంకణాలు, పటికబెల్లం ప్రసాదం ఉంటాయి. మొదటిగా 300 కిట్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ కిట్లు ఉచితంగా ఇస్తారా లేదా నామమాత్రపు రుసుము వసూలు చేస్తారా అన్న విషయంపై టీటీడీ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!