

ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో రూ.1,353.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.1,166.7 కోట్లతో పోలిస్తే ఇది 16 శాతం వృద్ధి. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.13,384 కోట్ల నుంచి 12.6 శాతం పెరిగి రూ.15,076.1 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 20.7 శాతం, ఆదాయం 4.7 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టెక్ మహీంద్రా రూ.4,810.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది రూ.4,251 కోట్లతో పోలిస్తే ఇది 13.15 శాతం అధికం. మొత్తం కార్యకలాపాల ఆదాయం 7.2 శాతం వృద్ధితో రూ.56,815.4 కోట్లకు చేరింది. అదే విధంగా ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.36 తుది డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 2025 నవంబరులో చెల్లించిన రూ.15 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ.51 డివిడెండ్ చెల్లించినట్లయింది. ఇది కంపెనీ చరిత్రలో అత్యధికం.
ఈ ఆర్థిక సంవత్సరంలో టెక్ మహీంద్రా 3,794 మిలియన్ డాలర్ల (సుమారు రూ.35,000 కోట్ల) విలువైన కొత్త కాంట్రాక్టులను సాధించింది. ఇది గత ఐదేళ్లలో అత్యధిక స్థాయి. ప్రాంతాల వారీగా చూస్తే అమెరికా ఆదాయం 7.7 శాతం వృద్ధితో 49.7 శాతానికి చేరింది. యూరప్ ఆదాయం 7.4 శాతం పెరిగి 26 శాతంగా నమోదైంది. ఇతర దేశాల ఆదాయం 2.7 శాతం తగ్గి 24.3 శాతానికి పరిమితమైంది. ఉద్యోగుల విషయంలో, జనవరి–మార్చి త్రైమాసికంలో 817 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2026 మార్చి 31 నాటికి 75,377కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొత్త నియామకాల లక్ష్యాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!