

విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలను నేడు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు పుణే జిల్లా బారామతి సమీపంలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
ప్రజలు చివరి నివాళులు అర్పించేందుకు అజిత్ పవార్ భౌతికకాయాన్ని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఉంచారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేడు సెలవు ప్రకటించడంతో పాటు మూడు రోజుల సంతాప దినాలను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి ప్రయాణిస్తుండగా, పొగమంచు కారణంగా రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో ల్యాండింగ్‌కు ముందు చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైనట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక సహాయకుడు, వ్యక్తిగత భద్రతాధికారి సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!