

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి ప్రాంతంలోని రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఈ నెల 16 న అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన 125 వ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ విగ్రహానికి “స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్” అనే పేరు పెట్టారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మద్రాసులో పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాంస్యంతో తయారవుతున్న ఈ విగ్రహాన్ని కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన కళాకారులు రూపొందిస్తున్నారు. విగ్రహంతో పాటు స్మృతి వనంలో మ్యూజియం, ఆడిటోరియం, మెమోరియల్ గార్డెన్ వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
రాజధానిలోని శాఖమూరులో ప్రభుత్వం 6.8 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ మరియు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. గత సంవత్సరం మంత్రి నారా లోకేష్ దీనికి శంకుస్థాపన చేశారు. అలాగే నెల్లూరులో ఉన్న పొట్టి శ్రీరాములు పుట్టిన ఇంటిని మెమోరియల్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. తెలుగు జాతి అభివృద్ధి చెందడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించగలమని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!