

తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నార్వే కంపెనీలను ప్రోత్సహించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ రంగాల్లో రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ఆయన తెలిపారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తెలంగాణ–నార్వే మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను మంత్రి ప్రతినిధి బృందానికి వివరించారు.
క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లైమేట్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో నార్వే గ్లోబల్ లీడర్‌గా ఉందని మంత్రి ప్రశంసించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ హెల్త్, బయోటెక్, మెడికల్ డివైజెస్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ఆధునిక రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై సమగ్ర రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ‘తెలంగాణ–నార్వే వర్కింగ్ గ్రూప్’ ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. దీనికి స్పందించిన నార్వే రాయబారి, తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రంతో భాగస్వామ్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!