

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లో 51 మంది మావోయిస్టులు లొంగిపోవడం ద్వారా మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిపై మొత్తం రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. శనివారం బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. బస్తర్ జిల్లా కేంద్రం జగదల్పూర్లో బస్తర్ పాండుమ్ 2026 ఉత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయపూర్‌కు వచ్చిన రోజునే ఈ భారీ లొంగుబాటు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బీజాపూర్ జిల్లాలో 20 మంది మహిళా క్యాడర్‌తో సహా 30 మంది మావోయిస్టులు లొంగిపోగా, సుక్మా జిల్లాలో మరో 21 మంది లొంగిపోయారు. వీరిలో 14 మంది మహిళా క్యాడర్ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి కార్డెక్స్ వైర్లు, జెలటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పునరావాస విధానాల కింద ప్రతి మావోయిస్టుకు తక్షణ సాయంగా రూ.50,000 అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవితం కల్పిస్తామని పోలీసులు విజ్ఞప్తి చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!