

నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వేసవి విద్యుత్ డిమాండ్ ప్రారంభమైందని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. ఖైరతాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, 33 కేవీ మరియు 11 కేవీ ఫీడర్లపై లోడ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 33 కేవీ ఫీడర్లపై 300 యాంప్స్, 11 కేవీ ఫీడర్లపై 150 యాంప్స్ లోడ్‌ను మించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను టంగ్ టెస్టర్‌తో రీడింగ్ తీసే ప్రక్రియను ప్రారంభించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈ నెల 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ 5 వేల మెగావాట్లకు మించవచ్చని అంచనా వేస్తున్నామని, అదనపు లోడ్ ఉన్న సబ్స్టేషన్లను గుర్తించి 20కి పైగా సబ్స్టేషన్లలో 16 మెగావోల్ట్స్ సామర్థ్యంగల పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే సమ్మర్ అవసరాల కోసం గ్రేటర్లో అదనంగా 1,888 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!