

రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘చేనేత కార్మికుల రుణమాఫీ పథకం’ (Loan Waivers to Handloom Weavers Scheme) అమలులో భాగంగా, గత బడ్జెట్‌కు అదనంగా రూ.16,27,60,000 నిధులు మంజూరు చేయడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో చేనేత కార్మికుల పాత రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రూ.33 కోట్లను కేటాయించగా, లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో అసలు అప్పు మొత్తం రూ.48.30 కోట్లకు చేరిందని చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ తెలిపారు. పెరిగిన అప్పు మరియు పథకం నిర్వహణ ఖర్చులను కలిపి అదనపు నిధులు అవసరమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అనేక జిల్లాల్లో రుణమాఫీ నిధులు విడుదల చేయాలంటూ చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు చేపట్టారు. దీనిని సానుకూలంగా స్వీకరించిన ప్రభుత్వం 2025-26 బడ్జెట్ అంచనాల నుంచి నిధులను విడుదల చేసి పరిశ్రమలు, వాణిజ్య, టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ (Shailaja Ramayyar) ద్వారా జీవో విడుదల చేసింది. మంజూరైన రూ.16.27 కోట్లతో చేనేత కార్మికులకు రుణ విముక్తి కలుగుతుంది. ఈ నిధుల్లో 2 శాతం పరిపాలనా ఖర్చులకు వినియోగించబడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది నేతన్నల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అప్పుల భారం తగ్గి, కొత్తగా బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశాలపై చేనేత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!