

దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత ఆకర్షణీయమైన పాలసీ ప్యాకేజీని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఎస్ అండ్ పీ గ్లోబల్ తాజా నివేదిక వెల్లడించింది. బలమైన విద్యుత్, నియంత్రణ ప్రోత్సాహకాలతో తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ విద్యుత్, మౌలిక వసతులు, మూలధనం, నియంత్రణ అంశాలతో కూడిన సమతుల్య ప్యాకేజీలను అందిస్తున్నాయని తెలిపింది. హైపర్‌స్కేలర్లను ఆకర్షించేందుకు విద్యుత్, సులభతర వ్యాపార నిర్వహణలో గుజరాత్ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాలు ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ డేటా సెంటర్ పాలసీ అట్రాక్టివ్‌నెస్ ఇండియా సూచీలో 100కు దాదాపు 50 స్కోర్ సాధించాయి.
2016 నుంచి 11 రాష్ట్రాలు అమలు చేస్తున్న 19 విధానాలను డీసీపీఏఐ సూచీ పరిశీలించింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు సంబంధించిన విధానాలను విద్యుత్ లభ్యత, భూమి-మూలధనం, నిర్వహణ-సాంకేతిక మద్దతు, నియంత్రణ-సులభతర వ్యాపార నిర్వహణ వంటి అంశాల ఆధారంగా మదింపు చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హరియాణా, కర్ణాటక 42–45 స్కోర్‌తో రెండో విభాగంలో ఉండగా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 30–40 స్కోర్‌తో మూడో విభాగంలో ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల సామర్థ్యం సుమారు 1.5 గిగావాట్లు ఉండగా, 2031–32 నాటికి 26.3 గిగావాట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. 2025–35 మధ్య డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ ఏటా 18 శాతం చొప్పున పెరగవచ్చని పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!