

వాహనదారులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ – PUCC) చెల్లుబాటు గడువులో కీలక మార్పులు చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం వ్యక్తిగత బీఎస్-6 వాహనాలకు ప్రస్తుతం ఏడాది పాటు ఉన్న పీయూసీసీ గడువును మూడేళ్లకు పెంచింది. మరోవైపు పాత వాహనాలకు మరింత తరచుగా సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. బీఎస్-4 వాహనాలకు ఆరు నెలలు, బీఎస్-1, 2, 3 వాహనాలకు మూడు నెలల చెల్లుబాటు గడువును నిర్ణయించింది. ఈ మార్పులతో కొత్త వాహనదారులకు రెన్యువల్ భారం తగ్గనుండగా, పాత వాహనాల కాలుష్య నియంత్రణపై మరింత పర్యవేక్షణ ఉండనుంది.
కొత్త షెడ్యూల్ ప్రకారం వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసిన తొలి ఆరేళ్లలో ప్రతి మూడేళ్లకోసారి పీయూసీసీ చేయించుకోవాలి. ఆరు నుంచి పదేళ్ల మధ్య వయసున్న వాహనాలకు ఏటా, పదేళ్లు దాటిన వాహనాలకు ఆరు నెలలకోసారి రెన్యువల్ తప్పనిసరి. బీఎస్-6 రవాణా వాహనాలకు తొలి రిజిస్ట్రేషన్ నుంచి ఆరేళ్ల వరకు రెండేళ్లకోసారి, ఆరు నుంచి పదేళ్ల మధ్య ఏటా, పదేళ్లు దాటిన తర్వాత ఆరు నెలలకోసారి పీయూసీసీ చేయించాలి. కేంద్రం మోటారు వాహనాల నిబంధనలు–2026ను నోటిఫై చేసింది. గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత వాహనానికి తొలిసారి రెన్యువల్ చేయించే సమయంలోనే సవరించిన గడువు వర్తిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!