

ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27 ప్రథమార్ధంలో అద్భుతమైన ఆర్థిక పనితీరును కనబరిచాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో ఈ బ్యాంకుల మొత్తం నికర లాభం 16.9 శాతం వృద్ధి చెంది రూ.1.10 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు, ప్రభుత్వరంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం తొలిసారిగా రూ.300 లక్షల కోట్ల మార్కును దాటి రూ.301.6 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 15.5 శాతం వృద్ధి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కాలంలో బ్యాంకుల డిపాజిట్లు 13.1 శాతం పెరిగి రూ.165.2 లక్షల కోట్లకు చేరుకోగా, రుణాలు 18.8 శాతం వృద్ధితో రూ.136.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే బ్యాంకుల నిర్వహణ లాభం 13.9 శాతం పెరిగి రూ.1.81 లక్షల కోట్లకు చేరింది. ఆస్తులపై వార్షిక రాబడి కూడా మూడు బేసిస్ పాయింట్లు మెరుగుపడి 1.11 శాతంగా నమోదైంది.
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభదాయకత వరుసగా ఐదో ఏడాది కూడా మెరుగుపడటం విశేషం. బ్యాంకుల్లో పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, రిస్క్ నిర్వహణ విధానాలను మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఈ వృద్ధికి దోహదపడ్డాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. రుణాల విభాగంలో రిటైల్ అడ్వాన్సులు 17 శాతం, వ్యవసాయ రుణాలు 19.5 శాతం పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ఇచ్చిన రుణాల్లో 20.4 శాతం వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారవేత్తల ప్రోత్సాహం, ఆర్థిక సమ్మిళితానికి ప్రభుత్వరంగ బ్యాంకులు అందిస్తున్న మద్దతును ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బ్యాంకుల ఆస్తుల నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి చారిత్రాత్మక కనిష్ఠ స్థాయి అయిన 1.69 శాతానికి తగ్గగా, నికర నిరర్థక ఆస్తుల (నెట్ ఎన్పీఏ) నిష్పత్తి 0.33 శాతానికి చేరింది. కొత్తగా మొండి బకాయిలుగా మారుతున్న రుణాలు తగ్గడం, రికవరీలు మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు 90 శాతానికి పైగా ప్రొవిజన్ కవరేజ్ రేషియోను కలిగి ఉన్నాయి. 2026 సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకుల క్యాపిటల్ అడెక్వసీ రేషియో వార్షిక ప్రాతిపదికన 93 బేసిస్ పాయింట్లు పెరిగి 16.89 శాతానికి చేరింది. ఇది నియంత్రణ సంస్థలు నిర్దేశించిన కనీస ప్రమాణాల కంటే ఎక్కువ. అలాగే కాస్ట్-టు-ఇన్కమ్ రేషియో 191 బేసిస్ పాయింట్లు తగ్గి 47.38 శాతానికి చేరడం నిర్వహణ సామర్థ్యం మెరుగుపడినట్లు సూచిస్తోంది. లాభదాయకత, ఆస్తుల నాణ్యత, మూలధన సామర్థ్యం, నిర్వహణ పనితీరులో వచ్చిన ఈ పురోగతి వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వ సంస్కరణల ప్రభావాన్ని తెలియజేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!