

భారత్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయం 2027లో 10 శాతం వృద్ధి చెంది సుమారు రూ.16.9 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బిజినెస్, టెక్నాలజీ ఇన్‌సైట్స్ సంస్థ గార్ట్‌నర్ వెల్లడించింది. ఈ వృద్ధిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-యాజ్-ఎ-సర్వీస్ (ఐఏఏఎస్) విభాగం అత్యధిక వృద్ధిని నమోదు చేయనుందని అంచనా వేసింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు అనుకూలమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు సైబర్ సెక్యూరిటీ, సావరిన్ సామర్థ్యాలు, డేటా ఆధునికీకరణపై పెట్టుబడులు పెరగడం ఐటీ వ్యయం వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలవనున్నాయి. ఏఐని ఇకపై ప్రత్యేక సాంకేతిక పెట్టుబడిగా కాకుండా వ్యాపార వృద్ధి, డిజిటల్ పోటీతత్వానికి పునాదిగా సంస్థలు భావిస్తున్నాయని గార్ట్‌నర్ వైస్ ప్రెసిడెంట్ అనలిస్ట్ డీడీ మిశ్రా పేర్కొన్నారు.
మరోవైపు, ఆర్థిక సేవలు, ప్రభుత్వ రంగాల్లో క్లౌడ్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతోందని గార్ట్‌నర్ తెలిపింది. భారత్‌లో డేటా సెంటర్ వ్యవస్థలపై వ్యయం 2027లో వార్షిక ప్రాతిపదికన 28.4 శాతం పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది. సాఫ్ట్‌వేర్‌పై వ్యయం కూడా 2026తో పోలిస్తే దాదాపు 19 శాతం వృద్ధి చెంది రూ.2.6 లక్షల కోట్లను దాటవచ్చని పేర్కొంది. ఇక ఐఏఏఎస్ విభాగంలో 2026లో మొత్తం వ్యయం రూ.58 వేల కోట్లకు మించవచ్చని అంచనా. ఈ వ్యయం 2027లో 40 శాతం పెరిగి రూ.81,580 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని గార్ట్‌నర్ వెల్లడించింది. పెరుగుతున్న డిజిటల్ అవసరాలకు అనుగుణంగా క్లౌడ్ మౌలిక సదుపాయాలను నిరంతరం విస్తరించాల్సిన అవసరం ఉందని గార్ట్‌నర్ సీనియర్ డైరెక్టర్ అనలిస్ట్ నరేష్ సింగ్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!