

లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఫ్రాంచైజీని అధికారికంగా కోరగా, అతని అభ్యర్థనను యాజమాన్యం తక్షణమే ఆమోదించింది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.
లక్నో క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ మాట్లాడుతూ, రిషభ్ పంత్ స్వయంగా ఈ అభ్యర్థనతో ఫ్రాంచైజీని సంప్రదించాడని తెలిపారు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ వెంటనే అంగీకరించామని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ సులభం కావని, కెప్టెన్‌గా జట్టుకు పంత్ అందించిన సేవలు, డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకువచ్చిన నాయకత్వాన్ని ఫ్రాంచైజీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.
"రిషభ్ పంత్ చేసిన అభ్యర్థనను మేము గౌరవపూర్వకంగా ఆమోదించాము. కెప్టెన్‌గా జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు. ఇప్పుడు మా దృష్టి మొత్తం జట్టుపైనే ఉంది. అత్యుత్తమ ప్రమాణాలను చేరుకునేలా జట్టును పునర్నిర్మించి, పునర్వ్యవస్థీకరించడంపై దృష్టి సారిస్తాము" అని టామ్ మూడీ తన ప్రకటనలో తెలిపారు.
కొనసాగుతున్న ఐపీఎల్ 2026 సీజన్లో కెప్టెన్ల మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే టోర్నీ మధ్యలో హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయం వార్తల్లో నిలవగా, ఇప్పుడు రిషభ్ పంత్ కూడా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఈ సీజన్లో ఇప్పటికే ఇద్దరు కెప్టెన్లు తమ పదవులకు దూరమైనట్లైంది. ఐపీఎల్ 2026 అనూహ్య పరిణామాలు, కీలక మార్పులతో అత్యంత ఆసక్తికర సీజన్‌గా మారిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
రిషభ్ పంత్ రాజీనామాతో లక్నో సూపర్ జెయింట్స్ తదుపరి కెప్టెన్ ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. జట్టు పునర్వ్యవస్థీకరణలో భాగంగా యాజమాన్యం త్వరలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!