

ఆసియా క్రీడలు 2026 సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే విషయంలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. మే 30, 31 తేదీల్లో జరగనున్న ట్రయల్స్‌లో ఆమె పోటీ పడేందుకు అనుమతించిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ దశలో ఆమెను పోటీల నుంచి తప్పుకోవాలని చెప్పడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వినేశ్ ఫొగాట్‌కు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే క్రీడా ఎంపికల వంటి అంశాల్లో కోర్టుల జోక్యం పరిమితంగా ఉండాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల షెడ్యూల్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు అవసరమని పేర్కొంటూనే, తుది నిర్ణయం వచ్చే వరకు వినేశ్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!