

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ చేసిన ప్రతిపాదనను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి ఆండ్రీ సైబిహా.. తమకు అందిన నాలుగు ప్రతిపాదనల్లో భారత్ ప్రతిపాదన అత్యంత విస్తృతమైనదని పేర్కొన్నారు. భారత్‌తో పాటు తుర్కియే, ఈజిప్ట్, అమెరికా నుంచి కూడా కాల్పుల విరమణకు సంబంధించిన ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. అయితే రష్యా కూడా అంగీకరించినప్పుడే ఏ కాల్పుల విరమణ ఒప్పందమైనా అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని సైబిహా స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ ప్రతిపాదన కేవలం సరిహద్దుల్లో కాల్పులు నిలిపివేయడానికే పరిమితం కాకుండా.. ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలు, ఓడరేవులపై దాడులు, నల్ల సముద్రంలోని పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని సైబిహా తెలిపారు. నల్ల సముద్రంలో ఇంధన, వ్యవసాయ రంగాలకు సంబంధించిన కాల్పుల విరమణతో పాటు వాణిజ్య రవాణా, ధాన్యం ఎగుమతులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చకు అవకాశం ఉందని ఉక్రెయిన్ సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనపై తుది పురోగతి రష్యా వైఖరిపై ఆధారపడి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!